: తెలంగాణ ఇక ప్రత్యేక రాష్ట్రం.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్
అందర్లోనూ ఉత్కంఠ రేపిన తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ తేల్చేసింది. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. హైదరాబాదు పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని స్పష్టం చేసింది. ఏఐసీసీ మీడియా వ్యవహారాల ఇన్ ఛార్జి అజయ్ మాకెన్ ఈ ప్రకటన చేశారు. అనంతరం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ, పదేళ్ళలో సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైదరాబాదులో సీమాంధ్రుల భయాందోళనలపై కేంద్రం చట్టం చేస్తుందంటూ.. కాంగ్రెస్ నిర్ణయం చారిత్రకమని ఆయన పేర్కొన్నారు.
సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చామని చెప్పారు. పది జిల్లాలతోనే తెలంగాణ అని విపులీకరించారు. ఇక సీమాంధ్రను ఆంధ్రప్రదేశ్ గా పరిగణిస్తామని దిగ్విజయ్ తెలిపారు. రాజ్యాంగపరమైన అంశాలను కేంద్ర క్యాబినెట్ పరిశీలిస్తోందని అన్నారు. కాలపరిమితికి లోబడి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుందని.. నదీ జలాలు, విద్యుత్ పంపిణీపై కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.