: మూడు సార్లు హెచ్చరికలు.. విని వదిలేయడంతోనే ఉపద్రవం
ఉగ్రవాద దాడులకు అవకాశం ఉందంటూ కేంద్ర ప్రభుత్వం ముందే హెచ్చరించింది. అయినా పోలీసుల అలక్ష్యం కారణంగా జంట బాంబు పేలుళ్లతో హైదరాబాద్ నగరంలోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతం రక్తమోడింది. 16 మంది అసువులు బాసారు. జరిగిన నిర్యక్ష్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు ఇప్పడు ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.
నిన్న పేలుళ్లు జరిగిన తర్వాత ఉగ్రవాదుల దాడులకు సంబంధించి అన్ని ప్రభుత్వాలను ముందే హెచ్చరించామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ పేలుళ్లపై మీడియా ప్రకటన చేశారు. కేంద్రం నుంచి హెచ్చరికలు ఎప్పడూ వస్తూనే ఉంటాయని చెప్పారు. ఈ పేలుళ్లకు ముందు వచ్చినది కూడా ఎప్పటిలానే వచ్చిన హెచ్చరికగా పోలీసులు భావించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే హెచ్చరికలను పెడచెవిన పెట్టినట్లు సీఎం చాలా స్పష్టంగా అంగీకరించినట్లయింది.
మరోవైపు కేంద్ర హోం మంత్రి షిండే ఈ రోజు ఉదయం దిల్ సుఖ్ నగర్ చేరుకుని బాంబు పేలుళ్ల ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద దాడులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికీ సాధారణ హెచ్చరికే జారీ చేశామని తెలిపారు. అంతేకానీ, ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకే ఈ హెచ్చరిక చేయలేదని చెప్పారు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం చూస్తే.. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం, ఇటు కేంద్ర హోం మంత్రి ప్రకటనలు తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే యత్నంగానే కనిపిస్తున్నాయి.
వాస్తవానికి ఉగ్రవాద దాడులు జరిగే ప్రమాదం ఉందంటూ కేంద్రం నుంచి సాధారణ హెచ్చరికలే కాకుండా ప్రత్యేకమైన హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో్ నుంచి రెండు, కేంద్ర హోంశాఖ నుంచి ఒక హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి. లష్కరే తాయిబా, ఇండియన్ ముజాహుదీన్ ఉగ్రవాదుల నుంచి దాడుల ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తగా ఉండాలని గతవారం కేంద్ర హోం శాఖ నుంచి ఒక సాధారణ హెచ్చరిక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్లింది. మళ్లీ ఈ నెల 20న అంటే బాంబు పేలుళ్లు జరగడానికి ఒక రోజు ముందుగా ఇదే విషయమై ఇంటెలిజెన్స్ బ్యూరో మరోసారి అప్రమత్తం చేసింది. హైదరాబాద్, బెంగళూరు, హుబ్లీ, కోయంబత్తూర్ నగరాలలో ఉగ్రవాద దాడులకు అవకాశం ఉందని, వెంటనే జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయా నగర పోలీసులకు సూచించింది. అయినా మన పోలీసులు లైట్ గా తీసుకోవడంతో ఘోరం జరిగిపోయింది.
- Loading...
More Telugu News
- Loading...