: మాకు అన్యాయం జరిగింది.. అందుకే ఈ నిర్ణయం: కొండా సురేఖ
వైఎస్సార్ సీపీ లో ముసలం పుట్టింది. ఆ పార్టీపై అదే పార్టీకి చెందిన తెలంగాణ నేత కొండా సురేఖ విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ డబ్బులు వసూలు చేసుకుంటోందని మండిపడ్డారు. జగన్ పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాము పార్టీలో ఉంటే విలువలు ఉంటాయని తమను అడ్డు తొలగించుకోవాలనుకున్నారన్నారు. జగన్, తాను ఒకే వేదికపైకి వస్తే తనకే ఎక్కువ ఆదరణ దొరికిందని, పార్టీలో ద్వితీయ నాయకత్వం బలపడుతుందేమోనని భయపడ్డారని, అందుకే తమ ప్రాధాన్యత లేకుండా జాగ్రత్తపడ్డారని ఆరోపించారు. "పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చి నన్ను నిర్లక్ష్యం చేశారు. అయినా సహించాం. కానీ నా భర్త ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం మర్చిపోయామంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడాన్ని సహించలేకపోయా'మన్నారు.
పార్టీ ఒక్కసారిగా తెలంగాణ సమస్యపై యూటర్న్ తీసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అందుకే ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నామని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిపై అభిమానాన్ని గుండెల్లో దాచుకుని రాజీనామా చేస్తున్నామని తెలిపారు. భవిష్యత్తుపై త్వరలోనే తెలుపుతామని ఆమె అన్నారు.