: అడుగడుగునా ఆర్తనాదాలు.. గర్భం కోల్పోయిన మహిళ!
హఠాత్తుగా చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటన వారి జీవితాల్లో మాయని మచ్చగా మిగిలిపోనుంది. మునుపెన్నడూ లేని విధంగా, ఎప్పటికీ మరచిపోలేనిదిగా సంభవించిన హైదరాబాదు దిల్ సుఖ్ నగర్ ఘటన పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపింది. పోయినవారు పోతే, గాయపడిన వారు రక్తపుమడుగు నుంచి ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు.
ఒకరికి కాలుపోతే మరొకరు చేయిలేక, ఇంకొంతమంది తమవారి ఆనవాళ్లు కనిపించడంలేదని, ఉన్నవారికి చికిత్స సరిగా అందడంలేదని బోరున విలపిస్తున్నారు. అసలు ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఇంకొంతమంది ఆర్తనాదాలు చేస్తున్నారు. ఘటనలో మొత్తం 119 మంది గాయపడిన సంగతి తెల్సిందే. నగరంలోని 8 ఆసుపత్రుల్లో వీరికి వైద్యం అందుతుండగా, ఎవరికి ఏ సమయంలో ఏమవుతుందోనన్న భయంతో వణికిపోతున్నారు.
అయితే కేర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 20 మందిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ ద్వారా వైద్యం అందిస్తున్నట్లు అక్కడి డాక్టర్లు చెప్పారు. వారిలో ఓ మహిళ గర్భం కోల్పోయిందని వెల్లడించారు. ఈ విషయం వైద్యుల ద్వారా తెలుసుకున్నఆ మహిళ కన్నీరుమున్నీరైంది.
ఇంకా కొంతమందికి వెన్నులోకి, ఇతర శరీర భాగాల్లోకి పేలుడులో ఉపయోగించిన ఇనుప ముక్కలు, మేకులు వంటి పదునైన వస్తువులు గుచ్చుకున్నాయన్నారు. కాగా, క్షతగాత్రులకు ఆసుపత్రి సిబ్బందే స్వచ్ఛందంగా రక్తదానం చేశారని వారు చెప్పారు.