: ఢిల్లీలో తెలంగాణ వేడి
రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకుందన్న వార్తలతో సీమాంధ్ర నేతలు చివరి ప్రయత్నాలకు తెరదీశారు. ఈ సాయంత్రం కీలకమైన యూపీఏ సమన్వయ కమిటీ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీల తర్వాత నిర్ణయం ప్రకటించనుందన్న సమాచారంతో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు. ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత ఎంపీలందరూ ఢిల్లీలోనే ఉండగా.. ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఇతర నేతలు కూడా చేరుకున్నారు. కనుమూరి బాపిరాజు నివాసంలో సీమాంధ్ర ఎంపీలంతా సమావేశమయ్యారు. రాష్ట్రాన్ని విభజించవద్దంటూ ఆఖరి నిమిషం వరకూ ఒత్తిడి తీసుకురావాలన్నది వీరి వ్యూహంగా తెలుస్తోంది.
మరోవైపు, తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు కూడా ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు. సీమాంధ్ర నేతల యత్నాలను తిప్పికొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవాలని వీరి ప్రయత్నంగా ఉంది. వెరసి ఢిల్లీ అంతటా తెలంగాణ వేడి వ్యాపించింది.