: జీవనప్రమాణం పెరుగుతోందట


కొంతకాలం క్రితం ఏదైనా జబ్బువస్తే ఇక ఆ మనిషి బతకడంపై ఆశలు వదులుకోవాల్సిందే. అయితే శాస్త్రవిజ్ఞానం అభివృద్ధి చెందిన కారణంగా మనకు ఎలాంటి జబ్బువచ్చినా దానికి తగిన మందులు లభిస్తున్నాయి. దీంతో మనం ఎంచక్కా బతికేస్తున్నాం. వైద్యరంగం సాధిస్తున్న అభివృద్ధి కారణంగా మనిషి జీవితకాల ప్రమాణాలు పెరిగాయట. ఇదేవిషయాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేక అధ్యయనం చేసి మరీ చెబుతున్నారు.

హార్వర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు 1991 నుండి 2009 వరకూ దాదాపు 90 వేల మంది ఆరోగ్య పరిస్థితులపై ఒక నిరంతరాయమైన అధ్యయనాన్ని, సమీక్షలను నిర్వహించారు. అనంతరం మనిషి జీవిత ప్రమాణకాలం పెరిగినట్టు తేల్చారు. వైద్యరంగంలో సాధిస్తున్న విజయాలు, పరిశోధనా ఫలితాల కారణంగా భూమిపై ప్రజలు ఎక్కువకాలం జీవించడమేకాక, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతున్నారని తేల్చారు. గత ఇరవయ్యేళ్ల కాలంలో మనిషి జీవితకాల ప్రమాణాలు పెరిగాయట. వయసుపైబడిన తర్వాత కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని ఈ పరిశోధనా బృందానికి సారధ్యం వహించిన డేవిడ్‌ కట్లర్‌ చెబుతున్నారు.

వీరు తమ పరిశోధనలో ఒక వయసు వచ్చాక వంట చేసుకోగలుగుతున్నారా? ఇంటిని శుభ్రంగా పెట్టుకోగలుగుతున్నారా? స్నానాదికాల విషయంలో ఇతరుల సాయం అవసరం లేకుండా తమకు తామే నిర్వహించుకోగలుగుతున్నారా? ఎలాంటి వూతమూ లేకుండా చక్కగా నడవగలుగుతున్నారా? డబ్బు వ్యవహారాలను, ఆర్ధిక లావాదేవీలను తామే స్వయంగా నిర్వహించుకోగలుగుతున్నారా? వంటి ప్రశ్నలతో కూడిన ఒక ప్రశ్నాపత్రాన్ని తయారు చేసి దాని ద్వారా ఈ విషయాన్ని గుర్తించినట్టు డేవిడ్‌ చెబుతున్నారు. ఈ ప్రశ్నావళికి వచ్చిన జవాబులే తమ పరిశోధనలకు ప్రాతిపదిక అని డేవిడ్‌ వివరించారు.

  • Loading...

More Telugu News