: పళ్లు ఊడాయా.. మీరు గజిని అవుతున్నట్లే
'పృష్ట తాడనాత్ దంత భంగ:' అని సంస్కృతంలో ఒక సామెత ఉంది. వీపు మీద తంతే మూతి పళ్లు రాలిపోతాయని దాని భావం. దానికి దీనికి సంబంధం ఏంటో తెలియకుండా ఫలితం ఉంటే.. అలా అంటారు. కానీ ఇప్పుడు వైద్య శాస్త్రంలో 'దన్త భంగ: ధారణ గత:' అని సామెతను కొత్తగా తయారుచేసి చదువుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎందుకంటే.. పళ్లు ఊడిపోయినప్పుడు మనిషిలో జ్ఞాపకశక్తి తగ్గడం అనేది మొదలవుతుందిట. పరిశోధకులు తక్కువ సహజ దంతాలున్న వారిలో తక్కువ జ్ఞాపకశక్తి ఉంటుందని తేలుస్తున్నారు.
న్యూయార్క్‌లోని శాస్త్రవేత్తలు 55 ఏళ్లు దాటిన 273 మందిపై పరిశోధనలు నిర్వహించి ఈ విషయం నిగ్గు తేల్చారు. పంటికి మెదడుకు సంబంధం ఉందని వారు తేల్చారు. దంతంనుంచి ఉండే నరాల ద్వారా మెదడుకు కొన్ని సంకేతాలు వెళుతుంటాయిట. దంతక్షయమై పంటిని కోల్పోతే ఆ దంతం న్యూరాన్ మరణించి, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ అధ్యయనం వివరాలు త్వరలోనే యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఓరల్ సైన్స్‌లో కూడా రానున్నాయి.