: సౌదీలో ఊచలు లెక్కబెడుతున్న తెలుగోళ్లు
నాలుగు డబ్బులు వెనకేసుకుందామన్న ఆశతో సౌదీ అరేబియా వెళ్లిన తెలుగు వాళ్లకు అక్కడ నరకం కనిపిస్తోంది! ఆస్తులు తాకట్టు పెట్టి విజిటింగ్ వీసాలపై అక్కడికెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నది కొందరైతే.. చాకిరీ చేయించుకున్న కంపెనీలు జీతాలు ఇవ్వకుండా మరికొందరిని బయటికి నెట్టేస్తున్నాయి. దీంతో బయటే ఏదో కూలి పని చేసుకుంటున్నవారిపై సౌదీ అరేబియా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.
నిర్దాక్షిణ్యంగా జైళ్లకు తరలిస్తున్నారు. అక్కడి భాష తెలియక, ఎవరిని సంప్రదిస్తే తాము సొంతగడ్డకు చేరుకుంటామో అర్థంగాక నిత్యం కుమిలిపోతున్నారు. ఇలాంటి వాళ్లు ఇక్కడ వందల సంఖ్యలో ఉన్నారు. ఇక ఇక్కడ చూస్తే తమవారి సమాచారం అందక బాధితుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే విజిటింగ్ వీసాల గడువు పూర్తయినా సౌదీలోనే ఉన్నారన్న కారణంతోనే అరెస్ట్ చేశామని అక్కడి అధికారులంటున్నారు.
దీనిపై స్పందిస్తూ, జగిత్యాలలోని గల్ఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ భారత రాయబార కార్యాలయానికి ఓ లేఖ రాసింది. ఇటీవలే కొన్ని గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగు వాళ్లను స్వదేశానికి రప్పించినట్టుగానే, సౌదీలో తెలుగువాళ్లకు కూడా ఉచితంగా విమాన టిక్కెట్లు అందించాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.