: రెండు ప్రాంతాలకు ప్యాకేజీలిస్తే ఓకే.. విభజన సరికాదు: టీజీ
రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదిక తీసుకుంటే రాయలసీమ ప్రాంతమే కోస్తా, తెలంగాణల కంటే వెనుకబడిన ప్రాంతమని టీజీ వెంకటేష్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడంతో రాష్ట్రవిభజన దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుందని వాపోయారు. ఇప్పటికైనా టీడీపీ, వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీఎం రాజీనామా చేసేందుకు వెనకాడరని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
ఒక వేళ విభజిస్తే రాయలసీమ పరిస్థితేంటో తెలుసుకోవాలని సీఎంను కోరినట్టు తెలిపారు. విభజనే పరిష్కారమైతే 6 జిల్లాలతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాలను రాయలసీమలో కలపాలని కోరారు. తెలంగాణ ప్రకటిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నారని టీజీ స్పష్టం చేశారు.