: బాట్లా హౌస్ కేసులో తుది తీర్పు రేపే
ఢిల్లీలో సంచలనం రేకెత్తించిన బాట్లాహౌస్ ఎన్ కౌంటర్ కేసులో తీర్పు రేపు వెలువడనుంది. అదనపు సెషన్స్ జడ్జి రాజేంద్ర కుమార్ శాస్త్రి ఈ తీర్పును వెలువరించనున్నారు. కాగా ఈ కేసులో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది షెహజాద్ అహ్మద్ ను ఢిల్లీ కోర్టు ఈ నెల 25 న దోషిగా నిర్ధారించింది. పోలీస్ అధికారి ఎంసీ శర్మను అతడు హత్య చేసినట్టు కోర్టు ధృవీకరించింది. దానితో పాటు హెడ్ కానిస్టేబుళ్లు బల్వంత్ సింగ్, రాజ్ బీర్ సింగ్ లపై హత్యాయత్నం చేసినట్టు స్పష్టం చేసింది. 2008 లో ఢిల్లీలో మూడు చోట్ల బాంబు పేలుళ్లు జరిగిన ఆరు రోజుల తరువాత సెప్టెంబర్ 19న జామియానగర్ లోని బాట్లా హౌస్ లో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
ఈ పేలుళ్లతో ప్రమేయం ఉన్న ఉగ్రవాదులు అక్కడున్నారన్న సమాచారంతో స్పెషల్ పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఉగ్రవాదులు అతిఫ్ అమీన్, మహ్మద్, సాజిద్ లు మృతి చెందగా పోలీస్ అధికారి ఎంసీ శర్మ, షెహనాజ్ జరిపిన కాల్పుల్లో మృతి చెందారు. షెహజాద్ తో పాటు జునాయిద్ అక్కడ్నుంచి పరారవగా, ఉగ్రవాది మహ్మద్ సైఫ్ పోలీసులకు లొంగిపోయాడు. అప్పట్లో కలకలం రేపిన ఈ కేసుపై రేపు తుదితీర్పు వెలువడనుండడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.