: మొక్కలు నైట్రోజన్ పీల్చుకునేలా కొత్త సాంకేతికత
మొక్కలు గాలిలోంచే నైట్రోజన్ పీల్చుకునేలా ఓ కొత్త సాంకేతికతకు రూపకల్పన జరుగుతోంది. నాటింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. తాజా, ఆవిష్కరణతో ప్రపంచవ్యాప్తంగా పంటలకు ఎంతో మేలు జరుగుతుందని, మొక్కలు గాలిలోంచే నైట్రోజన్‌ను పీల్చుకోగలిగితే.. దిగుబడులు కూడా ఎక్కువగా వస్తాయని అంటున్నారు. అదే సమయంలో పర్యావరణానికి, భూమి సారానికి ప్రమాదకరమైన రసాయనిక ఎరువుల వినియోగం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
నాటింగ్‌హాం యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఎడ్వర్డ్ కాకింగ్ నైట్రోజన్‌ను ఆకర్షించే ఒక బ్యాక్టీరియాను మొక్క వేర్లలోకి చొప్పించే సాంకేతికతను రూపొందించారు. ఆయన ఒక రకం చెరకులో ఇలాంటి దానిని గమనించి.. ఈ ఆవిష్కరణ చేశారు. దీనివలన మొక్కలు సొంతంగా గాలిలోంచే నైట్రోజన్ పీల్చుకోవడం జరుగుతుంది. మొక్కలకు గరిష్టంగా అవసరమయ్యే నైట్రోజన్ అవసరాలు దీనివల్ల ఎరువులు, మందులు వేయకుండా సాధ్యమవుతుంది.