: దిగ్విజయ్ సింగ్ నోటి దురద.. మహిళా ఎంపీపై విపరీత వ్యాఖ్యలు
ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ కు నోటి దురద ఎక్కువేనన్న సంగతి తెలిసిందే. దూకుడుగా వ్యాఖ్యానించడం ఆయన నైజమని పలు సందర్భాల్లో వెల్లడైంది కూడా. తాజాగా, కాంగ్రెస్ పార్టీకే చెందిన ఓ మహిళా ఎంపీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని మండ్సార్ వద్ద ఓ ర్యాలీని ప్రారంభించే సమయంలో అక్కడే ఉన్న మహిళా ఎంపీ మీనాక్షి నటరాజన్ ను ఉద్దేశించి 'తంచ్ మాల్' (కత్తిలాంటి సరుకు) అని వ్యాఖ్యానించారు. ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మీనాక్షి మంచి మనసున్న వ్యక్తి. ఆమె ఎంత సింపుల్ గా ఉంటారో, అంత నిజాయతీగానూ ఉంటారు. చాలా కష్టించి పనిచేస్తారు. చెప్పాలంటే ఆమె 'తంచ్ మాల్' వంటిది. నేను, తలపండిన ఆభరణాల వ్యాపారిలాంటివాడిని. ఏది నకిలీ నగో, ఏది ఒరిజనల్ సరుకో ఇట్టే చెప్పేస్తా' అని వ్యాఖ్యానించారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, తనపై దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలను మీనాక్షి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటోంది. తన పనితనాన్ని మెచ్చుకునే ఆయన అలా అన్నారని సర్దిచెప్పుకుంది. ఈ విషయమై బీజేపీ తీవ్రంగా స్పందించింది. దిగ్విజయ్ మానసిక సమతుల్యత కోల్పోయినవాడిలా మాట్లాడుతున్నాడని బీజేపీ నేత వినయ్ కతియార్ విమర్శించారు. తప్పనిసరిగా డిగ్గీ రాజాను పిచ్చాసుపత్రిలో చేర్చాలని కతియార్ సలహా ఇచ్చారు.