: పక్కా ప్లాన్ తోనే పేలుళ్లు?
దేశాన్ని కుదిపేసిన హైదరాబాద్ పేలుళ్ల ఘటన పక్కా ప్రణాళికతోనే జరిగిందని అర్థమవుతోంది. అఫ్జల్ గురు ఉరితీత నేపథ్యంలో తీవ్రవాద దాడులు జరగొచ్చని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదిక సమర్పించిన మరుసటి రోజే దాడులు జరగడం గమనార్హం. ఉగ్రవాదులు మరోసారి హైదరాబాద్ నే లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే భద్రత లోపాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో తేటతెల్లమవుతోంది.
కాగా, రాత్రి ఏడు గంటలకు దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో తొలి పేలుడు జరగ్గా, మరో నిమిషం తర్వాత వెంకటాద్రి, కోణార్క్ థియేటర్ల సమీపంలో మరో రెండు పేలుళ్లు జరిగాయని ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటనలో సైకిళ్లకు బాంబులు అమర్చి, రిమోట్ తో పేల్చినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. కాగా, మరణించిన వారి సంఖ్య కచ్చితంగా తెలియరావడంలేదు.
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో 11 మంది చనిపోయినట్టు పేర్కొన్నారు. ఈ విషాద సంఘటనను ఖండిస్తున్నట్టు దేశ ప్రధాని సహా పలువురు నేతలు ముక్తకంఠంతో నినదించారు. మృతుల కుటుంబాలకు కేంద్రం రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా, రాష్ట్రం రూ. 6 లక్షలు ఇవ్వనుందని సీఎం ప్రకటించారు. ఏదేమైనా, మరోసారి హైదరాబాద్ ఇలాంటి దాడులకు గురి కాకుండా ఉండాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.