: కరిగిన కొలెస్టరాల్ను ఇట్టే కనుక్కోవచ్చు
శరీరంలో పేరుకుపోయిన కొలెస్టరాల్ను కరిగించుకోవడానికి నానా తిప్పలూ పడుతుంటాం. అలాగే కొద్దిరోజుల తర్వాత మన శరీరంలోని కొలెస్టరాల్ ఏ మేరకు కరిగింది అనేది తెలుసుకోవాలని మనకు చాలా ఉబలాటంగా ఉంటుంది. అయితే ఇలా మన శరీరంలోని కొలెస్టరాల్ కరుగుదలను తెలుసుకునే అవకాశం త్వరలో మనకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం శాస్త్రవేత్తలు ఒక కొత్త పరికరాన్ని రూపొందించారు. చిన్న పరిమాణంలో ఉండే ఈ పరికరంతో మన శరీరంలోని కొలెస్టరాల్ ఏ మేరకు కరిగింది? అనే విషయాన్ని ఇట్టే తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
జపాన్లోని ఎన్టీటీ డొకోమో రీసెర్చి ల్యాబరేటరీస్కు చెందిన శాస్త్రవేత్తలు శరీరంలోని కొలెస్టరాల్ ఏ మేరకు కరిగింది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఒక కొత్త పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికరం జేబులో పట్టేంత చిన్న పరిమాణంలో ఉంటుంది. దీంతో బరువును కొలిచే పరికరాలతో మనకు అవసరం ఉండదని వీరు చెబుతున్నారు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు మనం పలు వ్యాయామాలు చేస్తుంటాం. బరువు తగ్గేందుకు కూడా వ్యాయామాలు చేస్తుంటాం. అయితే మన శరీరంలో ఏమేరకు కొలెస్టరాల్ కరిగింది అనే విషయాన్ని మాత్రం సరిగ్గా తెలుసుకోలేము. శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త పరికరం ఒక వ్యక్తి వ్యాయామం ద్వారా ఏ మేరకు తన శరీరంలోని కొవ్వును కరిగించాడనే విషయాన్ని గుర్తిస్తుందని చెబుతున్నారు.
ఇందులో ఉండే సెన్సర్ ఈ విషయాన్ని గుర్తిస్తుందని, శ్వాసలో వెలువడే అసిటోన్ స్థాయిలను కొలవడం ద్వారా ఈ పరికరం పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో కొవ్వు కరిగినపుడు అసిటోన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ అసిటోన్ ఊపిరితిత్తుల్లో సూక్ష్మతిత్తుల గుండా విడుదలవుతుంది. మనం శ్వాస వదిలినపుడు అది బయటికి వస్తుంది. మన నిశ్వాసను గుర్తించేందుకు ఈ పరికరంలో ఒత్తిడి సెన్సర్ ఉంటుంది. నిశ్వాసలోని అసిటోన్ను గుర్తించేందుకు రెండురకాల సెమీకండక్టర్ ఆధారిత గ్యాస్ సెన్సర్లు ఉంటాయి. ఒక వ్యక్తి శ్వాస వదలగానే ఈ పరికరం అసిటోన్ గాఢత స్థాయిలను లెక్కించి పది క్షణాల్లో స్మార్ట్ఫోన్కు వివరాలను పంపిస్తుంది.