: మోడీ వీసాపై ఎంపీల లేఖ 'కాపీ, పేస్ట్' లా ఉంది: ఏచూరి
గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి వీసా ఇవ్వొద్దంటూ 65 మంది భారతీయ ఎంపీలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఆ లేఖ 'కాపీ, పేస్ట్' వ్యవహారంలా ఉందని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి అన్నారు. ఆ లేఖపై తన సంతకం ఉందన్న వార్తలను ఏచూరి ఖండించారు. తానెలాంటి లేఖపై సంతకం చేయలేదని స్పష్టం చేశారు. వ్యక్తిత్వపరంగా గానీ, సిద్ధాంతాల ప్రకారంగా కానీ, ఏ స్వతంత్ర దేశం అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కుదరదని చెప్పారు.
ఇదిలా ఉంటే, పార్లమెంటు సభ్యులు ఒబామాకు లేఖ రాయడంపై బీజేపీ మండిపడింది. ఈ విషయంపై వివరణాత్మక పరిశోధన జరగాలని డిమాండు చేసింది. దీనిపై ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ..సగానికి సగం ఎంపీలు ఆ లేఖను రాయలేదని తిరస్కరించారన్నారు. ఎందుకంటే ఆ లేఖపై ఫోర్జరీ చేసిన సంతకాలు ఉన్నాయన్నారు. అయితే, ఆ లేఖ నకిలీనా? అసలు, ఎంపీలు రాయలేదా? అని అనుమానం వ్యక్తమవుతోంది.