: ఇళ్లల్లోనే ఉండిపోవాలని ముంబయి పౌరులకు బీఎంసీ సూచన
తప్పనిసరైతేనే బయటకు రావాలని, లేకుంటే ఇళ్లకే పరిమితం కావాలని ముంబై నగర వాసులకు 'బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)' హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలతో ముంబై వీధులన్నీ నీటి సరస్సులను తలపిస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి నగరంలో ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. కొలాబా ప్రాంతంలో గత 20 గంటల్లో 158 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శాంతాక్రజ్ లో 168 మిల్లీ మీటర్లు కురిసింది. వచ్చే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాల ధాటికి స్కూళ్లన్నీ మూతపడ్డాయి. మెట్రో రైళ్లు అరగంట ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు ప్రాంతాలలో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడ్డాయి.