: ఈ రోబోలకు స్పర్శజ్ఞానం ఉందట!
రోబోలకు స్పర్శ జ్ఞానం ఉంటుందా... అంటే ఉంటుందనే చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే అలాంటి కొత్తరకం చర్మాన్ని తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో మన చర్మానికి ఉన్నటువంటి స్పర్శజ్ఞానం రోబోలకు కూడా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఎలాగంటే ఎవరైనా సదరు రోబోను తాకినట్టయితే వెంటనే అది వెలుగులను చిమ్ముతుంది. దీంతో అతి తనను ఎవరో తాకినట్టు తెలుసుకుంటుంది.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన అలీ జావే నేతృత్వంలో కొందరు పరిశోధకుల బృందం ఈ కొత్త రకం చర్మాన్ని తయారు చేశారు. కాగితంలాగా పలుచగా ఉండే ఈ ఎలక్ట్రానిక్ చర్మాన్ని తయారు చేయడం ఇదే తొలిసారి. రోబోలకు అమర్చే ఈ చర్మాన్ని ఎవరైనా తాకితే అది వెలుగులను చిమ్ముతుంది. మనం దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటే అంత ఎక్కువగా వెలుగులను చిమ్ముతుందట. దీన్ని రోబోలకు మాత్రమే కాకుండా వివిధ వస్తువులకు కూడా చుట్టవచ్చని అలీ చెబుతున్నారు. మానవ`యంత్ర అనుసంధానంలో ఇది ఒక కొత్త అవతారమని, సెమీ కండక్టర్ నానోవైర్ ట్రాన్సిస్టర్లను పలుచటి రబ్బరు షీట్లపై పరచడం ద్వారా ఇలాంటి ప్రయత్నాన్ని గతంలోనే చేశామని, దీని ఆధారంగానే తాజాగా ఈ ఈ`చర్మం రూపొందించినట్టు అలీ తెలిపారు.
ఈ కొత్త రకం ఈ-చర్మం 16I16 పిక్సెల్స్ మేర ఉంటుందని, ఒక్కో పిక్సెల్‌లో ఒక ట్రాన్సిస్టరు, ఆర్గానిక్ ఎల్‌ఈడీ, పీడన సెన్సర్ ఉన్నాయని, ఈ చర్మంతో రోబోలకు కూడా స్పర్శజ్ఞానం వస్తుందని, టచ్‌స్క్రీన్లుగా కూడా పనికివచ్చే వాల్‌పేపర్లను దీనితో తయారు చేయవచ్చని అలీ చెబుతున్నారు. వాహనాల్లో ఎదురుగా ఉండే ఎలక్ట్రానిక్ నియంత్రణల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చని, దీన్ని చేతికి చుట్టుకుని దాని ద్వారా రక్తపోటును, నాడి కొట్టుకునే రేటును కూడా పరిశీలించవచ్చని ఈ పరిశోధనల్లో పాల్గొన్న చువాన్ వాంగ్ చెబుతున్నారు.