: సిబ్బంది నియామకం తీరుపై మండిపడుతున్న ఉపాధ్యాయులు
పంచాయతీ ఎన్నికల్లో అధికారుల అసమర్ధ నిర్ణయాల వల్ల సిబ్బంది తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. మండల కార్యాలయాల్లో పలుకుబడి లేని సిబ్బందిని, దిగువ కులాల సిబ్బందిని ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు కేటాయించారని పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. మగాళ్లకు దగ్గరగా విధులు కేటాయించిన అధికారులు విజయనగరం జిల్లా ఏవోబీ ప్రాంతాలైన గుమ్మలక్ష్మీపురం, కురుపాం, వీరఘట్టాం, దత్తి రాజేరు వంటి మండలాల్లో మహిళలకు విధులు కేటాయించారు. ఈ మండలాల్లోని కొన్ని గ్రామాలకు ఇప్పటికీ రహదారులు లేవు, కాలినడకనే నడవాల్సి ఉంది. పొలం గట్ల మీద బ్యాలెట్ బాక్సులు పట్టుకుని తీవ్ర ఇబ్బందుల్లో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో మహిళా ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా నిండు గర్భిణీ అని కూడా చూడకుండా మెదక్ జిల్లాలో దుబ్బాక మండలానికి చెందిన అనిత అనే ఉపాధ్యాయురాలికి విధులు కేటాయించారు. దీంతో తాను నిండు గర్భిణీనని, విధులకు హాజరుకాలేనని అధికారులకు విన్నవించుకున్నా కనికరించలేదు. పోలింగ్ మధ్యలో ఆమెకు పురిటినొప్పులు రావడంతో ఆమెను తరలించేందుకు 108 కు ఫోన్ చేయగా ధర్నాలో ఉన్న 108 సిబ్బంది రావడానికి లేటైంది. దీంతో అనితకు మార్గ మధ్యలోనే ప్రసవమై బిడ్డ మరణించింది. ఇప్పుడు తల్లి పరిస్ధితి కూడా విషమంగా ఉంది. కేవలం అధికారుల తీరుతోనే తన బిడ్డ మరణించిందని ఆమె తీవ్ర నిరాశలో కూరుకుపోయింది. ఆమెకు జరిగిన నష్టాన్ని తమ తలలేని నిర్ణయాలతో ఏ రకంగా భర్తీ చేస్తారో అధికారులకే తెలియాలి.