: సీమ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి: బైరెడ్డి
రాయసీమకు చెందిన ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. సీమను రెండు ముక్కలు చేసేందుకు యత్నాలు జరుగుతున్నా, తమ ప్రాంత నేతలు నోరెత్తకుండా చోద్యం చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు సీమ ముక్కలవడం కోసం కాచుక్కూర్చున్నారని, అందుకే రెండువేపులా తమదే అధికారం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు.
మైసూరా రాయల తెలంగాణ అంటుంటే, ఆయన కుటుంబ సభ్యులు సమైక్యాంధ్ర అంటున్నారని, ఇదేం పద్దతని బైరెడ్డి ప్రశ్నిస్తున్నారు. తరాల చరిత్ర కలిగిన రాయసీమను ముక్కలు చేయడానికి తాము అంగీకరించబోమని అన్నారు. కావాలంటే సీమ రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీడబ్ల్యూసీకి లేఖ రాస్తున్నట్టు తెలిపారు. టీజీకి చెందిన పరిశ్రమ ఆలంపూర్ లో ఉన్నందునే, మహబూబ్ నగర్ జిల్లాలోని భాగాన్ని రాయలసీమలో కలపాలని కొత్తపల్లవి అందుకున్నారని బైరెడ్డి మండిపడ్డారు.