: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు.. కోనసీమకు ముంపు ముప్పు
తెలంగాణ జిల్లాలు వర్షాలతో అతలాకుతలమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ధాటికి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వాగులు, వంకలు, నదులు, ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో గోదావరి నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ కారణంగా కోనసీమ జిల్లాలు నీట మునిగే ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే పదుల సంఖ్యలో గ్రామాలు నీట మునగగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరదల ప్రభావానికి ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 17 మంది మృతి చెందారు. లక్షల క్యూసెక్కుల నీరు గోదావరి లోకి వచ్చి చేరింది. ముందస్తుగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వరదనీటి ముంపు బెడద ఉన్న గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించారు. అయితే అక్కడ ప్రభుత్వం అవసరమైన సౌకర్యాలను కల్పించలేదని బాధితులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దేవాలయాల్లో ప్రసాదం ఇచ్చేలా పులిహోర ప్యాకెట్లను పంచుతున్న అధికారులు కనీసం త్రాగేందుకు మంచినీరు ఏర్పాటు చేయడం లేదని ఆరోపిస్తున్నారు. వరదల్లో నష్టపోతారని తరలించిన ప్రభుత్వం.. పిల్లలు, వయసు మళ్లినవారని కూడా చూడకుండా తమను గాలికి వదిలేసిందని ఆరోపిస్తున్నారు.
మరో వైపు అధికారులు వరద ఉద్ధృతిని సమీక్షిస్తూ పరిస్థితులను అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాలో వరదనివారణ కేంద్రం ఏర్పాటుచేసి రక్షణ, పర్యవేక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విపత్తుల నిర్వహణ అధికారులు జిల్లా కలెక్టర్లతో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. వీటి ఆధారంగా జిల్లాల కలెక్టర్లు మండలాధికారులకు అధికారాలు జారీ చేశారు. ఇప్పటికే వేలాది ఎకరాల పంట నష్టం జరిగినందున పరిహారం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని అంటున్నారు. హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు జారవిడవడం, ఏరియల్ సర్వే చేయడం ద్వారా సహాయచర్యలు ముమ్మరం చేశామని అధికారులు చెబుతున్నారు.