: దేశంలోకి పెద్ద ఎత్తున బంగారం స్మగ్లింగ్
బంగారం దిగుమతులు తగ్గించడం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలతో స్మగ్లింగ్ పెద్ద ఎత్తున పెరిగిందని ఆర్థిక శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగాలు అనుమానిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే జూన్ లో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి. ఏకంగా 80 శాతం తగ్గాయి. మే నెలలో 180 టన్నుల బంగారం దిగుమతి అయితే, అది జూన్ లో 31 టన్నులకు పడిపోయింది. ఒక్కసారిగా ఈ స్థాయిలో తగ్గడం వెనుక బంగారం స్మగ్లింగే కారణమని నిఘా విభాగాలు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాయి.
బంగారం దిగుమతులు పెరుగుతూ పోవడంతో కరెంట్ ఖాతాలోటు అంతకంతకూ విస్తరిస్తోంది. అదే సమయంలో ఎగుమతులు పెరగడం వల్ల డాలర్లకు డిమాండ్ పెరిగి రూపాయి విలువ తగ్గిపోతోంది. ఈ నేపథ్యంలో దిగుమతులపై సుంకాన్ని 6 నుంచి 8 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక ఆర్ బీఐ కూడా బ్యాంకులు బంగారం కొనుగోళ్లపై నిషేధం, విక్రయాలపై నియంత్రణలు విధించింది. బంగారంపై రుణాలకు కూడా పరిమితి విధించింది. ఇలా తీసుకున్న నిర్ణయాల వల్ల బంగారం దిగుమతులలో 20 నుంచి 30 శాతమే తగ్గాలని, కానీ 80 శాతం తగ్గాయంటే, రాచమార్గంలో కాకుండా దొడ్డి దారిలో బంగారం వచ్చిపడుతోందని అధికారులు భావిస్తున్నారు.