: ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోతున్న భారతీయులు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. కానీ, భారతీయులకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతోంది. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్ డీఎస్) భారత్, శ్రీలంక, నేపాల్ దేశాలలో ప్రజాస్వామ్య స్థితిగతులపై సర్వే నిర్వహించింది. ఇందులో బారత్ లో ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే వారి సంఖ్య 47 శాతంగానే ఉన్నట్లు వెల్లడైంది. 2005లో ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారి సంఖ్య 55 శాతంగా ఉంటే తాజాగా అది 47 శాతానికి పడిపోయింది. ఎనిమిదేళ్ల కాలంలో 8 శాతం మంది ప్రజలు ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అంటే మెజారిటీ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించడం లేదని తెలుస్తోంది.
ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని గానీ, లేదని గానీ ఎటూ తేల్చుకోలేని వారు 2005లో 30 శాతం ఉండగా, అది 18 శాతానికి తగ్గిపోయింది. 22 రాష్ట్రాలలోని 5,465 మందిపై శాంపిల్ సర్వే నిర్వహించారు. మహిళల కంటే పురుషులే ప్రజాస్వామ్యంపై సంతృప్తి వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గాలలో 51 శాతం మంది ప్రజాస్వామ్యమే ఉండాలని కోరుకుంటున్నారు. మెజారిటీ వర్గాలలో మాత్రం 43 శాతం మందే ప్రజాస్వామ్యం పట్ల సానుకూలత కనబరిచారు. ఇక, సిగ్గుపడాల్సిన విషయం ఏమిటంటే, 54 శాతం మందికి ప్రజాస్వామ్యం అంటే అర్థమేమిటో తెలియదని చెప్పారు. 10 శాతం మందే సరైన అర్థం చెప్పగలిగారు. ఇదీ మన పాలకులు నడిపిస్తున్న ప్రజాస్వామ్య రథం.