: ప్రముఖ సైకత శిల్పికి సొంత రాష్ట్రంలో గుర్తింపు కరవు


ఆయన కళా నైపుణ్యాన్ని ప్రపంచం గుర్తించింది. ప్రముఖ వార్తాంశాలకు స్పందించే ఈ కళాకారుడు.. పూరీలోని సాగర తీరంలో ఇసుకపై అందమైన శిల్పాలను మలిచి వాటి ద్వారా తన భావాల్ని పలికిస్తాడు. అతడే సుదర్శన్ పట్నాయక్. ఈ ఏడాదే మాస్కోలో జరిగిన ప్రపంచ సైకత చిత్రాల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్న కళాకారుడాయన. జాతీయ, అంతర్జాతీయ పత్రికలు సైతం ఆయన సాగరతీరంలో వేసిన చిత్రాలను ప్రముఖంగా ప్రచురిస్తుంటాయి. కానీ, సొంత రాష్ట్రం ఒడిశా మాత్రం ఆయన గొప్పదనాన్ని గుర్తించడం లేదు.

సుదర్శన్ పట్నాయక్ స్వస్థలం పూరి. అక్కడే శాండ్ ఆర్ట్ మ్యూజియం(సైకత చిత్రాల ప్రదర్శన శాల) ఏర్పాటు చేయాలన్నది సుదర్శన్ పట్నాయక్ బలమైన ఆకాంక్ష. ప్రభుత్వం సాగరతీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో భూమిని కేటాయించింది. కానీ, ఒక మెలిక పెట్టింది. ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని నిబంధన విధించింది. 'సైకత కళ ప్రచారానికి ఉపయోగపడనప్పుడు ఆ భూమి నా దగ్గర ఎందుకు, ప్రభుత్వానికి ఇచ్చేయడమే బెటర్' అని సుదర్శన్ మీడియాకు తెలిపారు. అంతర్జాతీయ చాంపియన్ షిప్ గెలుచుకుని సొంత రాష్ట్రానికి వస్తే ప్రభుత్వం నుంచి అభినందనలే తప్ప సహకారం లేదన్నారు.

తమ దేశానికి వచ్చి శాండ్ ఆర్ట్ ను ప్రచారం చేయాల్సిందిగా గతంలో పలు అభివృద్ధి చెందిన దేశాలు సుదర్శన్ ను ఆహ్వానించాయి. కానీ, సొంత దేశం, సొంత పట్టణానికే తన కళ అంకితమని ప్రకటించిన సుదర్శన్ కు మాత్రం చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

  • Loading...

More Telugu News