: మహిళలకే అనుమానమెక్కువట!
భార్యా భర్తలు పరస్పరం అవగాహనతో ముందుకు సాగితేనే జీవితం సజావుగా, ఆనందంగా సాగుతుంది. అలాకాకుండా ఒకరిని ఒకరు అనుమానించుకుంటూ ఉంటే ఇక ఆ కాపురం ఎంతవరకూ సాగుతుంది అనేది సంశయమే. అయితే అమెరికా మొత్తంమీద యాభైశాతం మంది ప్రజలు తమ జీవిత భాగస్వామిని అనుమానిస్తున్నారట. అందునా ముఖ్యంగా మహిళలే తమ భాగస్వామిపై అధికంగా అనుమానపడుతున్నారట. ఈ విషయాన్ని ఒక తాజా సర్వే వెల్లడించింది.
సీకింగ్ అరేంజ్‌మెంట్.కామ్ అనే సంస్థ సుమారు 22,121 మంది అమెరికన్లపై ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వామికి సంబంధించిన ఈమెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లు, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు వంటి వాటిలోని వారి ఖాతాలను రహస్యంగా పరిశీలిస్తున్నట్టు తేలింది. అంతేకాదు, తమ జీవిత భాగస్వామి కార్యకలాపాలను పరిశీలించేందుకు రహస్యంగా ప్రైవేటు డిటెక్టివ్‌లను కూడా సంప్రదిస్తున్నట్టు ఈ సర్వేలో కనుగొన్నారు. సర్వే నిర్వహించిన వారిలో సుమారు 18 శాతం మంది తమ జీవిత భాగస్వామి ఫోన్ సంభాషణలను ట్యాంపింగ్ ద్వారా వింటుండగా, 4 శాతం మంది ప్రైవేటు డిటెక్టివ్‌లతోను, 7 శాతం మంది జీపీఎస్ వ్యవస్థతోను, 16 శాతం మంది క్రెడిట్ కార్డు సమాచారాన్ని సేకరిస్తూ తమ జీవిత భాగస్వాముల గురించి తెలుసుకుంటున్నారట.
అయితే ఇలాంటి గూఢచర్యానికి పాల్పడేవారిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారని ఈ సర్వేలో తేలింది. 73 శాతం మంది మహిళలు తమ భర్తల వ్యవహారాలను రహస్యంగా తెలుసుకుంటున్నారని, పురుషుల్లో కేవలం 27 శాతం మంది మాత్రమే ఇలాంటి పనులకు పాల్పడుతున్నట్టు తేలింది. అయితే ఇలాంటి విషయాల్లో న్యూయార్క్ వాసులు తమ జీవిత భాగస్వాముల పట్ల గట్టి నమ్మకంతో ఉండగా, రిచ్‌మండ్ ప్రాంతానికి చెందిన వారిలో మాత్రం 68 శాతం మంది తమ భాగస్వాముల వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్టు ఈ సర్వేలో తేలింది.
ప్రస్తుతం ఎక్కువమంది జీవితం సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉండడం వల్ల ఇలాంటి వివరాలను సేకరించడం పెద్ద కష్టం కాదని, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచడం సాధ్యం కావడం లేదని సీకింగ్ అరేంజ్‌మెంట్.కామ్ సీఈవో బ్రాండన్ వాడే చెబుతున్నారు. ఇలా నిఘా పెట్టడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇలా ఎక్కువమంది తమ జీవిత భాగస్వామిపై నిఘానేత్రం ఏర్పాటు చేసుకుంటున్నారని బ్రాండన్ అంటున్నారు.