: 'అత్త' చేతుల మీదుగా ఆడియో రిలీజ్


పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన 'అత్తారింటికి దారేది' చిత్రం పాటల పండుగ ఈ రోజు సాయంకాలం హైదరాబాదులో వైభవంగా జరిగింది. ఆద్యంతం అభిమానుల కేరింతల నడుమ ఈ వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో ఉల్లాసంగా జరిగింది. అతిధులు అంటూ వేరే ఎవరూ లేకుండా, కేవలం ఈ సినిమా కోసం పనిచేసిన యూనిట్ సభ్యుల మధ్యే కుటుంబ వేడుకగా ఇది జరగడం విశేషం. టైటిల్ కి తగ్గట్టుగా చిత్రంలో అత్త పాత్ర పోషించిన నదియా చేత ఆడియో సీడీని విడుదల చేయించారు.

ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ తో తన పరిచయం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ఆకట్టుకునేలా చెప్పారు. పవన్ మాట్లాడుతూ, "మీరు నాకు ఎంత ప్రేమ, ఆప్యాయతలు ఇస్తున్నారో ... నాకూ మీ పట్ల అంతే వుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఇలాంటి వేడుకలు చేయడం నాకు ఇష్టం వుండదు. అందుకే ఎక్కువగా ఎవాయిడ్ చేస్తుంటాను. నాకు సన్నిహితులు చాలా తక్కువ మంది వుంటారు. వారిలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. జానీ సినిమా తర్వాత మొదటిసారి త్రివిక్రమ్ నన్ను కలిసి కథ చెప్పారు. నాకు అప్పుడు మూడ్ లేదు. ఆయన కథ చెబుతున్నప్పుడు నిద్రపోయాను. మానసికంగా అలసిపోయానేమో. అయినా ఆయన నవ్వుకుని వెళ్ళిపోయి, జల్సాతో వచ్చారు.

నా బాధలకు మీరెంతగా కాపు కాస్తారో, త్రివిక్రమ్ కూడా అంత భరోసా ఇచ్చారు. ఆయనతో చేయడం ఎప్పుడూ హ్యాపీనే. ఇక హాస్యనటుడు అలీ నాకు గుండె లాంటివాడు. అతను లేకుండా నా సినిమా ఉండదు. అలాగే ఇంటర్ చదువుతున్నప్పటి నుంచీ బ్రహ్మానందం గారు నాకు తెలుసు. ఆయనతో వ్యక్తిగతంగా ఎక్కువ అనుబంధం వుంది" అన్నారు. చివర్లో అభిమానుల కోరికపై ఆ సినిమాలోని డైలాగును అదే ఫోర్స్ తో చెప్పి అలరించాడు పవన్. ఇంకా చిత్రంలో నటించిన నటీనటులు కూడా మాట్లాడారు. ఈ వేడుకలో హాస్యనటుడు అలీ చేసిన వ్యాఖ్యానం అందరికీ కితకితలు పెట్టింది.

  • Loading...

More Telugu News