: వాహనాలు మాట్లాడతాయి!
అవును, వాహనాలు పరస్పరం మాట్లాడుకొంటాయని, ఇలా భవిష్యత్తులో జరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాహనాలు పరస్పరం మాట్లాడుకొని హెచ్చరికలు చేసుకుంటే రోడ్డు ప్రమాదాలను నివారించే అవకాశం ఉందని భావించిన శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఇందుకోసం మేధో రవాణా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా తమ పరిశోధనలు చేస్తున్నారు.
నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు వాహనాలు పరస్పరం మాట్లాడుకొనేలా మేధో రవాణా వ్యవస్థ అభివృద్ధి చేసేందుకు తమ పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ విషయం గురించి డాక్టర్ డాన్ స్టాన్సిల్ మాట్లాడుతూ ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే ఒకే చోదకుడు పలు వాహనాలను నియంత్రించడం, ట్రాఫిక్ ఇబ్బందుల్లో వాహనాలే పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం వంటి చర్యలకు వీలుంటుందని, ప్రస్తుతం ఈ వ్యవస్థ ప్రాథమిక దశలోనే ఉందని, ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు చాలా వరకూ తగ్గుతాయని చెబుతున్నారు.