: ఆర్కిటిక్‌లోని మంచు ఆవిరవుతుంది!
మంచు మహాసముద్రం ఆర్కిటిక్... ఎప్పుడు చూసినా మంచుతో కప్పబడి ఉండే ఆర్కిటిక్‌ని అసలు మంచే లేకుండా చూస్తామా...? ఏమో... చూసినా చూసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో మంచు కరిగిపోయి ఆర్కిటిక్ మంచు రహితంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తేలింది.
అమెరికా, చైనా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా నిర్వహించిన ఒక పరిశోధనలో మంచు రహిత ఆర్కిటిక్‌ను చూసే అవకాశం ఉందని తేలింది. 2058 నాటికి మంచు లేని ఆర్కిటిక్‌ను కచ్చితంగా చూస్తామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇలా మంచు లేకుండా ఉండే ఆర్కిటిక్ ఏడాదిలో కేవలం కొన్ని నెలల వరకే పరిమితం అయ్యే అవకాశం ఉందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూతాపం కారణంగా ప్రస్తుతం మంచు కరిగిపోతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో అలా జరిగే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2058 నాటికి వేసవి తర్వాత వచ్చే సెప్టెంబరులో ఆర్కిటిక్‌లో మంచు అచ్ఛాదన వదిలేయవచ్చని, తర్వాత మళ్లీ మంచుతో కనిపించే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్కిటిక్‌లో మంచు కరిగిపోవడానికి భూతాపమే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు తమ పరిశోధనకు 'కపుల్డ్ మోడ్ ఇంటర్ కంపారిజన్ ప్రాజెక్ట్ ఫేస్-5' అనే పద్ధతిని ఉపయోగించారు. ఈ పద్ధతిలో ఆర్కిటిక్‌లో ఇప్పుడున్న మంచు పెళుసుదనాన్ని పరిగణనలోకి తీసుకుని శాస్త్రవేత్తలు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇలా మంచు కోల్పోవడం అనే మార్పు ఆర్కిటిక్‌లో 2054 నుండి మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.