: మాఫియా ముఠాల కోసం ఓ పత్రిక
విజ్ఞానం, సమాచారం కోసం జన బాహుళ్యానికి పత్రికలు అందివచ్చాయి. ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులూ తమ మధ్య సమాచారం కోసం ప్రత్యేకంగా పత్రికలను నడుపుకునే స్థాయికి అభివృద్ధి చెందాయి. ఇప్పటికే తాలిబన్లు పత్రికలను నడుపుకుంటున్నట్లు విన్నాం. ఇప్పుడో మాఫియా గ్యాంగ్ కూడా ఇదే విధంగా సొంత పత్రికను ఒకటి నడుపుతోంది. అందులో మాఫియా ముఠాకు చెందిన వారి కవితలు, ఇతరత్రా సలహాలు వంటివి ఉంటాయి. అన్నట్టు ఈ పత్రికను ఎవరో పెద్ద ఎడిటరు గారు నడపడం లేదు. స్వయంగా మాఫియా ముఠానే తమ వర్గం వారికోసం ప్రత్యేకంగా నడుపుతుంది. ఇందులో మాఫియా వర్గానికి చెందిన వారి ప్రచురణలే ఉంటాయి.
ఇటలీలో మాఫియా, చైనాలో ట్రయాడ్స్‌లాగా జపాన్‌లో యకూజా అనే వర్గం ఒక మాఫియా వర్గం. ఇది పేకాట, వ్యభిచారం వంటి సాంఘిక వ్యతిరేక కార్యకలాపాల నుండి సెటిల్‌మెంట్లు, వైట్‌కాలర్ నేరాలను కూడా చేస్తుంటుంది. ఈ వర్గంలో అతిపెద్ద గ్రూపు 'యమగూచి-గూమి'. ఇందులో మొత్తం 27 వేల మంది సభ్యులున్నారు. అయితే ఇంతమంది ఉన్న తమ గ్రూపులో ఐక్యత కోసం 'యమగూచి-గూమి షింపో' పేరుతో ఆ వర్గం 8 పేజీల మేగజైన్‌ను ప్రచురించింది. ఈ పత్రికలో కవిత్వానికి కూడా ఒక ప్రత్యేక పేజీని కేటాయించారు. 'సాంకీ షిబున్' అనే పత్రిక ఈ వివరాల్ని తెలియజేసింది.
ఈ మాఫియా పత్రికలో ఫ్రంట్ పేజీలో గ్రూపు నాయకుడు షినోడా తమ వర్గంలోని యువ సభ్యులు ఆచరించాల్సిన క్రమశిక్షణ, విలువలను (!?) గురించి కూడా రాశాడట. జపాన్‌లో మాఫియా వర్గం మనుగడ కష్టంగా ఉందని, వారికి వ్యాపారం అంత లాభసాటిగా లేదని కూడా షినోడా చెప్పాడట. అంతేకాదు ఈ మేగజైన్‌లో పలు సీనియర్ మాఫియా సభ్యుల సలహాలతోబాటు హైకూలూ కూడా ఉంటాయట. మాఫియా సభ్యులు బ్యాంకు ఖాతాలు తెరవకుండా, జపాన్‌లో రియల్ ఎస్టేట్ ఒప్పందాలు కుదుర్చుకోకుండా తెచ్చిన కొత్త ఆర్డినెన్స్‌తో వారి కార్యకలాపాలు కష్టమయ్యాయని, అందుకే తమ వర్గం సభ్యుల్లో ఉత్సాహం నింపేందుకు ఇలా తమ వారికోసం ఒక ప్రత్యేక మేగజైన్ యకూజా తెచ్చి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.