: ఈడో పెద్ద ఆర్టిస్టు!
ఎవరైనా బొమ్మలు గీస్తుంటే మనం వీడో పెద్ద ఆర్టిస్టు అంటుంటాం. అయితే మనుషులు బొమ్మలు గీయడం కాదు... ఒక మరమనిషి బొమ్మలు గీస్తే... మన రోబో సినిమాలో చిట్టి మెహెందీ పెడతాడుకదా... అలాగే ఈ కొత్తరకం రోబో ఎంచక్కా బొమ్మలు గీసేస్తాడట. గీతలను ఎక్కడ కలపాలి? అనే విషయంలో కూడా చక్కగా తానే నిర్ణయాలు తీసేసుకుంటుందట.
జర్మనీలోని కోన్‌స్టాంజ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఒక చక్కటి రోబోను తయారు చేశారు. ఈ రోబోకు ఇ-డేవిడ్ అనే పేరు కూడా పెట్టారు. ఇ-డేవిడ్ తన సాఫ్ట్‌వేర్ సాయంతో ఒక స్ట్రోక్ తర్వాత మరో స్ట్రోక్ వేస్తూ చక్కగా చిత్రాన్ని పూర్తి చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. బొమ్మలను గీయడంలో ఎక్కడ గీతలు కలపాలి? అనే విషయంలో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడమే కాదు, ఎంచక్కా 24 రంగులతో చిత్రాలను కూడా గీసేస్తుంది. మరో విషయమేమంటే ఇ-డేవిడ్‌గారు తాను వాడిన కుంచెలను తనంతట తానే శుభ్రం చేసేసుకుంటారట. మొత్తానికి ఈ రోబోగారు మంచి ఆర్టిస్టే!