: కాలచక్రంలో తేడా వస్తోంది!
మన రోజువారీ కాలచక్రంలో తేడావస్తోంది. సాధారణంగా రోజుకు ఎన్ని గంటలు అంటే మనం ఠక్కున 24 గంటలు అని చెబుతాం. అయితే ఇకపై అలా చెప్పడానికి కుదరదేమో. ఎందుకంటే, ఇప్పటి వరకూ రోజుకు 24 గంటలు అనేది స్థిరంగా ఉంటోంది. అయితే ఇదేమీ స్థిరంగా ఉండదని, మార్పులకు లోనవుతుంటోందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది.
బ్రిటన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో భూమిలోని కోర్ భాగంలో సంభవించే పరిణామాల వల్ల రోజు నిడివిలో 5.9 ఏళ్లకోసారి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తేలింది. లివర్‌ఫూల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఏడాది నుండి పదేళ్ల కాలపరిమితిలో రోజు నిడివిలో చోటుచేసుకుంటున్న మార్పులపై అధ్యయనం చేశారు. వీరి అధ్యయనంలో రోజువారీ సమయంలో తేడా వస్తున్నట్టు తేలింది. భూమి రోజుకు ఒకసారి తన చుట్టూ తాను తిరుగుతుంది. అయితే ఈ గమనంలో రోజువారీ సమయంలో తేడా వస్తోందట. 30 కోట్ల ఏళ్ల కిందట ఏడాదికి 450 రోజులు ఉండేవని, రోజుకు 21 గంటలే ఉండేవని పరిశోధకులు చెబుతున్నారు. భూభ్రమణ వేగం తగ్గడం వల్ల రోజు నిడివి పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.