: వడ్డీ రేట్లు తగ్గుతాయా..? రూపీ బలపడుతుందా.?


ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ ఈ రోజు మరోసారి సైకలాజికల్ మార్క్ 60 దాటి మళ్లీ 59.88 సమీపానికి దిగివచ్చి ట్రేడవుతోంది. ఈ పరిస్థితులలో వడ్డీ రేట్లను ఆర్ బీఐ తగ్గిస్తుందా? అన్న సందేహాలు నెలకొన్నాయి. మే నెలలో దేశ పారిశ్రామికోత్పత్తి అధోముఖంలో పయనించి, మైనస్ 1.6శాతంగా నమోదవడం ఆర్థిక వేత్తలను కలవర పరుస్తోంది. దేశీయ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు మందగించాయన్నది ఒప్పుకోవాల్సిన విషయం. అదే సమయంలో దేశం నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కి పోతున్నాయి. దీంతో మరిన్ని పెట్టుబడులు వస్తేగానీ ఉత్పత్తి పుంజుకోదని, ఇందుకు ప్రభుత్వం ఉద్దీపన పథకాన్ని ప్రవేశపెట్టాలని పారిశ్రామిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం ఆర్ బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించాలని కోరుతున్నారు. అలాగే, బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించి, మరిన్ని రుణాలు అందిస్తే చేదోడుగా ఉంటుందన్నది వాదన. ఇప్పటికే వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న కంపెనీలు అధిక వడ్డీ రేట్ల వల్ల ఇక్కట్లను ఎదుర్కోవాల్సి వస్తోందని.. ఈ భారాన్ని తప్పించకుంటే మొదటికే మోసం వస్తుందని పారిశ్రామిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఒకవైపు పడిపోయిన పారిశ్రామికోత్పత్తి, మరోవైపు అధిక ద్రవ్యోల్బణం, ఇంకోవైపు రూపాయి విలువ క్షీణత.. ఇవన్నీ ఆర్ బీఐ చర్యలకు అడ్డుగా నిలుస్తున్నాయి. వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం ఇంకా పెరిగి, రూపాయి విలువ అదుపు తప్పుతుందేమోనని ఆర్ బీఐ భయపడుతోంది. దీంతో ఈ నెల 30న పరపతి విధాన సమీక్షలో ఆర్ బీఐ వడ్డీ రేట్లను తగ్గించే సాహసం చేయకపోవచ్చని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News