: వేల ఏళ్ల కిందే బ్రిటన్‌లో గడియారం వుంది!
గడియారం అనేది మనకు ఇప్పుడు చాలా సర్వసాధారణం. అయితే కొన్ని వేల ఏళ్ల క్రితం గడియారం అంటే ఏమిటో తెలిసుంటుందా...? తెలిసే అవకాశం లేదు. అయితే గడియారానికి సంబంధించి, సమయ పాలనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్‌కు మంచి పేరుంది. ఇది ఇప్పటిది మాత్రమే కాదు... కొన్ని వేల ఏళ్ల క్రితం నుండి కూడా బ్రిటన్‌కు చెందిన ఆదిమ తెగవారు సమయం గురించి సరైన అంచనాలతో జీవనాన్ని సాగించారని పరిశోధకులు చెబుతున్నారు. సుమారు పదివేల ఏళ్ల క్రితమే బ్రిటన్‌లోని ఆదిమ తెగవారు కాలం తీరుతెన్నులను గురించి సరైన అంచనాలను వేసినట్టు, కాల నిర్ణయంలో వారు పట్టు సాధించినట్టు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అబెర్డీన్ షైర్‌లోని బ్యాంచెరీ సమీపంలో ఒకప్పుడు మధ్యరాతి యుగానికి చెందిన ఆదిమవాసులు నివసించినట్టు గతంలో జరిపిన తవ్వకాల్లో వెల్లడైంది. ఈ తవ్వకాల్లో అక్కడ గోతులు కనిపించాయి. ఈ గోతులను అక్కడ స్తంభాలు, లేదా రాళ్లను ఉంచడానికి ఉపయోగించి ఉంటారని శాస్త్రవేత్తలు భావించారు. అయితే వీటిని ఎందుకు తవ్వారు? అనే విషయానికి సంబంధించిన సమాచారం అంతుచిక్కకుండా ఉండేది. బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన విన్సెంట్ గాఫ్‌నీ నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ గోతుల దిశా కోణాన్ని పరిశీలించి, ఇవి చంద్రుడి దశలు వంటి ఖగోళ సంబంధ పరిణామాలకు అనుగుణంగా ఉన్నట్టు గుర్తించారు. దీన్ని బట్టి అవి మౌలిక క్యాలెండరు సంబంధ విధులను నిర్వర్తిస్తున్నట్టు తేల్చారు. దీంతో పదివేల ఏళ్ల క్రితం స్కాట్లాండ్‌లో నివసించిన ఆదిమ తెగకు చెందిన వారు ఇలా సమయం తీరుతెన్నులపై పట్టు సాధించారని, దీంతో కాలానికి సంబంధించిన భావనను తొలిసారిగా ప్రవేశపెట్టిన తెగల్లో ఇది కూడా ఒకటని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వేట, ఆహార సేకరణ ద్వారా జీవనాన్ని గడిపే ఆదివాసి ప్రజలు ఒక భారీ సంవత్సర గడియారాన్ని నిర్మించారని ఈ ఆధారాల ద్వారా చెప్పవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గుంటల ద్వారా గడుస్తున్న చంద్రమానాలు, వాటి ఆధారంగా మారుతున్న సీజన్లు గుర్తించడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.