: టెలిగ్రాం.. బై బై
'సర్ టెలిగ్రాం..' అంటే ఒకప్పుడు కంగారు పడిపోయే వారు. టెలిఫోన్లు పూర్తిస్థాయిలో వేళ్ళూనుకోని రోజుల్లో వేగంగా సమాచారం చేరవేసేందుకు వారధిలా టెలిగ్రాం సేవలు భారతీయులకు అందుబాటులోకి వచ్చాయి. నాడు లేఖలు కూడా ఉండేవి. కానీ, అవి చేరడానికి రోజుల తరబడి సమయం పట్టేది. త్వరితగతిన సమాచారం పంపుకునేందుకు టెలిగ్రాం సదుపాయం వీలు కల్పించింది. దీంతో టెలిగ్రాంను సహజంగా అత్యవసర పరిస్థితుల్లోనే వినియోగించుకునేవారు. ఎవరైనా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా, ఎవరికేమైనా అయినా టెలిగ్రాం ద్వారానే తెలియపరిచేవారు. సంతోష సమయాలనూ పంచుకున్నా, ఎక్కువగా అత్యవసర విషయాలను చేరవేయడానికి టెలిగ్రాం చేదోడుగా ఉండేది. అందుకే టెలిగ్రాం వచ్చిందంటే కంగారుగా అందుకుని చూసుకుని, విషాదవార్త కాదనుకుంటే ఊపిరి పీల్చుకునేవారు.
1850లో టెలిగ్రాం దేశంలో కళ్లు తెరిచింది. కోల్ కతా, డైమండ్ హార్బర్ మధ్య ప్రయోగాత్మకంగా టెలిగ్రాఫ్ లైన్ ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ సేవలను ఎక్కువగా వినియోగించుకుంది. 1854లో టెలిగ్రాం సేవలను ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో 75 కేంద్రాలను ప్రారంభించారు. తదనంతర కాలంలో బీఎస్ఎన్ఎల్ ఈ సేవలను దేశవ్యాప్తం చేసింది.
కానీ, కాలం మారింది. మరి నేడు టెలిగ్రాం కంటే వేగంగా, అవతలి వారితో క్షణాల్లో కనెక్ట్ అయ్యేందుకు మొబైల్ ఫోన్లు, అంతర్జాలం వచ్చేశాయి. టెలిగ్రాం సేవలు చిన్నబోయాయి. నేడు టెలిగ్రాం వ్యవస్థ నిర్వహణకు దేశంలో వార్షికంగా 100 కోట్ల రూపాయలు ఖర్చవుతుంటే ఆదాయం 75 లక్షల రూపాయలు మాత్రమే వస్తోంది. దీంతో ఈ సేవలను నిలిపివేయాలని బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. దీంతో ఇన్నేళ్ల పాటు ప్రజల జీవితాలతో మమేకమైన టెలిగ్రాం నేటితో శాశ్వత సెలవు తీసుకుంటోంది. ఈ రోజు రాత్రి 9 గంటలతో దేశంలో టెలిగ్రాం సేవలను నిలిపివేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఆర్.కె.ఉపాధ్యాయ తెలిపారు. '160 ఏళ్ల టెలిగ్రాం.. నీ సేవలను మేమెన్నటికీ మరువం, చరిత్ర నిన్ను శాశ్వతంగా గుర్తుంచుకుంటుంది.. బై బై'.