: ఇలా చేస్తే యంగ్‌గా కనిపిస్తారు
మీరు మీ తోటి వయసున్న వారికన్నా పదేళ్లు యంగ్‌గా కనిపించాలనుకుంటున్నారా... అయితే వెంటనే ఓ సైకిల్ కొనేయండి... కొనేసి ఇంట్లో పెట్టుకోవడం కాదు... ఎంచక్కా దాన్ని తొక్కుతూ ఉండండి... దీంతో మీకు చక్కటి వ్యాయామంతోబాటు మీ వయసు కూడా తక్కువగా కనిపిస్తుందంటున్నారు పరిశోధకులు.
స్వీడన్‌కు చెందిన కొందరు అధ్యయన కర్తలు నిర్వహించిన ఒక పరిశోధనలో వ్యాయామంలో సైక్లింగ్కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పలు లాభాలున్నట్టు తేలింది. నిజానికి వ్యాయామం అంటే మనం సాధారణంగా నడక, లేదా పరుగులెత్తడం, అదీ కాకుంటే బరువులెత్తడం అనే అనుకుంటాం. అయితే వీటన్నిటితోబాటూ సైక్లింగ్ కూడా చేయడం వల్ల అటు మన శరీరం బరువు తగ్గడంతోబాటు మానసికంగా ఎంతో ఉత్తేజంగా కూడా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల శరీర కండరాలు దృఢంగా తయారవుతాయి. రోజూ సైక్లింగ్ చేసేవారు ఇతరులకంటే కూడా పదేళ్లు చిన్నవారిగా కనిపిస్తారు, సైక్లింగ్ వల్ల కెలోరీలు అధికంగా ఖర్చు కావడం వల్ల ఊబకాయం సమస్య దరిచేరదు, అంతేకాదు, అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఓ నలభై నిముషాల పాటు సైక్లింగ్ చేయడం వల్ల ఆ సమస్య కూడా అదుపులోకి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.