: ఐర్లాండ్ గర్భస్రావ చట్టానికి ఆమోదం
మత చాంధసవాద ఐర్లాండులో గర్భస్రావ అనుమతి చట్టానికి మద్దతు లభించింది. తీవ్ర నిరసనల మధ్య ఈ చట్టాన్ని ప్రభుత్వం ఆమోదించింది. గర్భస్రావ చట్టంలో మార్పులు చేర్పులపై ఐర్లాండ్ చట్ట సభలో శుక్రవారం తెల్లవారుజాము వరకూ సుధీర్ఘ చర్చ జరిగింది. గర్భస్రావానికి అనుమతించే చట్టానికి 127 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా, 31 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో గర్భిణి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గర్భస్రావం చేయొచ్చనే చట్టానికి ఆమోదం లభించింది. సంకీర్ణ ప్రభుత్వ సారధిగా ఐర్లాండ్ ప్రధాని కెన్నీ ఈ చట్టానికి తుదిరూపు తీసుకురానున్నారు. క్యాధలిక్ దేశంలో త్వరలో ఈ చట్టం అమలు కానుంది.
అయితే క్యాధలిక్ మత సిద్ధాంతం ప్రకారం గర్భస్రావం మహా పాపం. దేవుని అనుగ్రహంగా భూమిమీదికి వచ్చే బిడ్డను నిరోధించే హక్కు ఎవరికీ లేదనేది క్యాధలిక్కుల సిద్దాంతం. దీనికి అనుగుణంగా ఆయా దేశాల్లో స్కానింగ్ పరీక్షలను కూడా నిర్వహించరు. ఒకవేళ నిర్వహిస్తే అది ప్రభుత్వానికి తెలిస్తే వారికి భారీ జరిమానా విధించి, అనుమతి పత్రాన్ని రద్దు చేస్తారు. గత ఏడాది సవితా హాలప్పన్ మరణించడంతో ఆ దేశంపై అంతర్జాతీయంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దాంతో ఆ దేశం తాజా నిర్ణయం తీసుకుంది.