: సెల్ ఫోన్ కలిగివుందని కొట్టి చంపారు!
మహిళలపై ఆకృత్యాలకు నెలవుగా మారిన పాకిస్తాన్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వర్షంలో తడుస్తూ ఆరుబయట నృత్యం చేశారని ఇద్దరు అక్కాచెల్లెళ్ళను కాల్చి చంపిన ఘటన మరువకముందే, ఈ కిరాతక చర్య వెలుగు చూసింది. డేరాఘాజీ ఖాన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో సెల్ ఫోన్ కలిగి ఉందన్న కారణంతో ఆరిఫా బీబీ అనే ఇద్దరు బిడ్డల తల్లిని రాళ్ళతో కొట్టి చంపారు. స్వయంగా ఆమె మామ, ఇతర బంధువులే ఈ దారుణానికి ఒడిగట్టడం పాకిస్తాన్ లో మానవీయ విలువల పతనాన్ని సూచిస్తోంది. సెల్ ఫోన్ లో మాట్లాడడమే ఆమె చేసిన తప్పిదం కాగా.. ఆరిఫా వ్యవహారంపై గ్రామపెద్దల తీర్పుకు అనుగుణంగా ఆమెపై రాళ్ళ వర్షం కురిపించారు. దీంతో, ఆరిఫా అక్కడిక్కడే మరణించిందని ఆమె సోదరులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు గ్రామ పెద్దలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.