: టీమిండియాకు భువనేశ్వరే ఆశాదీపం!
టీమిండియా ట్రైసిరీస్ లో టైటిల్ సాధించాలంటే భువనేశ్వర్ మరోసారి విజ్రుంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగే బలంగా బరిలో దిగుతున్న టీమిండియా బౌలింగ్ లో మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో వన్డేలో శ్రీలంకపై అస్సలు ప్రభావం చూపలేకపోయిన టీమిండియా బౌలర్లు, శ్రీలంక భారీ స్కోరు సాధించడం, సిరీస్ లో కుదురుకోవడంలో కాస్త సహకారమందించారు. విండీస్ తో ప్రభావవంతమైన ఆటతీరు కనబరచలేకపోయిన లంకేయులు, భారత జట్టుపై మాత్రం సాధికారికంగా ఆడారు. దీంతో లంకతో జరిగిన లీగ్ మ్యాచుల్లో లంకదే పైచేయిగా సాగింది.
చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా నిలకడైన ప్రదర్శన చేసినప్పటికీ అందరికంటే భువనేశ్వర్ కుమార్ దే తిరుగులేని ప్రదర్శన. నిలకడైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరే కుమార్ పై టీమిండియా భారీ ఆశలే పెట్టుకుంది. జహీర్ ఖాన్ లేమితో సతమతమవుతున్న భారత జట్టుకు కీలక బౌలర్ గా ఎదిగిన భువనేశ్వర్ భారత బౌలింగ్ దాడి పదును మరోసారి శ్రీలంకకు చూపితే కానీ విజయం సాధ్యంకాదు. దీంతో భువనేశ్వర్ పై టీమిండియా భారీ ఆశలే పెట్టుకుంది.