: వైట్ హౌస్ లో గరిటె తిప్పిన భారత చిన్నారులు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రథమ మహిళ మిచెల్లీ ఒబామా.. వీళ్ళిద్దరూ ఎలాంటి వారితోనైనా ఇట్టే కలిసిపోతారు. తమ వాక్చాతుర్యం, కలివిడితనంతో అందరినీ ఆకట్టుకుంటారు. వీళ్ళిద్దరూ కలిశారంటే సందడే సందడి, అది వైట్ హౌస్ కానివ్వండి, అధికారిక నివాసమైనా కానివ్వండి, సరదాగా ఉండడమే తమకిష్టం అంటారు ముక్తకంఠంతో. అలాంటి సరదాప్రియులను భారతీయ చిన్నారులు తమ వంటకాలతో మురిపించారు. ఈ చిట్టి చెఫ్ లు వండిన భారతీయ వంటకాలు, ఘుమఘుమలు వెదజల్లుతుంటే ఒబామా దంపతులకు చవులూరిపోయాయంటే అతిశయోక్తి కాదు.
అమెరికన్ చిన్నారుల్లో మంచి ఆరోగ్య అలవాట్లను పెంపొందించే క్రమంలో అధ్యక్ష కార్యాలయం వైట్ హౌస్ లో అధికారిక విందు ఏర్పాటు చేశారు. ఇటీవలే అమెరికా వ్యాప్తంగా నిర్వహించిన వంట పోటీల్లో గెలుపొందిన ఆరుగురు భారతీయ బాలలను ఈ విందుకు ఆహ్వానించారు. వారు తయారుచేసిన చికెన్ మసాలా రేవ్, స్ప్రింగ్ రోల్స్, క్యాప్సికం డిష్, ఆకుకూరల సూప్, పుదీనా చట్నీ, స్క్రంప్షియన్ స్ప్రింగ్ రోల్స్ ఒబామా దంపతులను లొట్టలేయించాయి. వీటన్నంటిని ఎంతో ఇష్టంగా ఆరగించిన అమెరికా ప్రథమ దంపతులు భారతీయ వంటకాలంటే తమకు ఎంతో మక్కువని పేర్కొన్నారు.