: అడ్డంగా దొరికిపోయిన విద్యుత్తు శాఖ ఏడీఈ
విద్యుత్తు కెపాసిటీ 1 కేవీ నుంచి 4 కేవీకి మార్చేందుకు ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుని నల్లచెర్వు ఏడీఈ సీహెచ్ వెంకటేశ్వరరావు ఎసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఎస్వీఎన్ కాలనీకి చెందిన జగన్నాధరావు తన స్థలంలోని రేకుల షెడ్డులో ఉన్న విద్యుత్తు సరఫరా సామర్ధ్యాన్ని 1 కేవీ నుంచి 4కేవీకి మార్చాలని విద్యుత్తు శాఖాధికారులకు ధరఖాస్తు చేసుకున్నాడు. దీనికోసం 12,950 రూపాయలను రుసుంగా చెల్లించాడు. సామర్ధ్యం పెంచేందుకు అదనంగా మరో 10,000 లంచం డిమాండ్ చేయడంతో ఆయన ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏడీఈ వెంకటేశ్వరరావు తన నివాసంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పి నరసింహారావు తన సిబ్బందితో కలిసి దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో ఏడీఈపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.