: ఆ నెలలో 'తప్పడం' మంచిది కాదట!
గర్భధారణ అనేది మే నెలలో జరిగితే బిడ్డకు మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. మే నెలలో నెల తప్పిన తల్లులకు బరువు తక్కువగా ఉండే పిల్లలు, అలాగే నెలలు పూర్తిగా నిండని పిల్లలు పుట్టే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు సుమారు 15 లక్షల మంది పిల్లలపై చేసిన పరిశోధనలో ఈ విషయం నిర్ధారించారు. మే నెలకు తల్లులు నెల తప్పడానికి సంబంధం ఏంటని ఆలోచిస్తే సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో 'ఫ్లూ' వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. గర్భిణుల్లో ఈ వ్యాధి చాలా సులభంగా వ్యాపిస్తుంది. దీంతో మే నెలలో నెల తప్పిన గర్భిణులకు ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న జనవరి, ఫిబ్రవరి మాసాలకు ఏడు, లేదా ఎనిమిది నెలల గర్భం ఉంటుంది.
ఈ సమయంలో తల్లులు ఫ్లూ వ్యాధి ప్రభావానికి గురైతే గర్భంలోని బిడ్డకు సరైన పోషకాలు అందవు, దీంతో బిడ్డ తక్కువ బరువుతో పుట్టడమో, లేదా ఒక్కోసారి ఏడు లేదా ఎనిమిది నెలలకే ప్రసవం కావడం వంటివి జరుగుతుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే మే నెలలో గర్భం రాకుండా చూసుకోమని, లేదా ప్రతి గర్భిణీ కూడా ఫ్లూ వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాల్సి ఉంటుందని ఈ పరిశోధనలో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు.