: కలిసి పాడితే హాయ్ హాయ్!
కలిసి పాడితే హాయే హాయి... దీనివల్ల మన గుండెకు ఎంతో మేలోయి అంటున్నారు పరిశోధకులు. పాట ఎలా పాడితేనేం అంటున్నారా... అలాకాదు పాట పాడడం కాదుగానీ బృందగానంతో మాత్రం మన గుండెకు చాలా మేలు జరుగుతుందని, దీనివల్ల గుండె పనిచేసే తీరు మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
గోధెన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో భాగంగా బృందగానంలో గానం చేస్తున్న గాయకుల గుండె లయను నమోదు చేశారు. ఈ సందర్భంగా సంగీతంలోని మెలోడీ, తదితర అంశాల ప్రభావం గుండె క్రియాశీలతపై నేరుగా ప్రభావం చూపుతున్నట్టు వారు గుర్తించారు. అందరితో కలిసి పాడడం వల్ల ఆ బృందంలోని సభ్యుల గుండె లయ ఏకరీతిన సాగి, బృందంలోని సభ్యుల నాడి కొట్టుకునే తీరు కూడా ఒకేసారి పెరుగుతూ, తగ్గుతుంటుందని, శ్వాసప్రక్రియలో లయబద్ధమైన అలవాటు పెరగడం వల్ల గుండె కొట్టుకునే తీరుపై ప్రభావం పడుతుందని, దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
మన జీవితంలో ఉద్వేగాలకు సంబంధించి మన శరీరంలోని వేగస్ నాడి చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది. బృందగానం ఈ వేగస్ నాడి పనితీరును నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో పాల్గొన్న బిజోర్న్ వికాఫ్ చెబుతున్నారు. అంతేకాదు బృందగానం చేసే గాయకుల శరీరంలోని కండర కదలికలు, నాడీ క్రియాశీలతను ఏకరీతిగా సాగేలా చేస్తుందనీ, ఇది గుండెకు చాలా ఉపకరిస్తుందనీ ఆయన చెబుతున్నారు.