: మరోసారి భారత్ లోకి చొరబడ్డ చైనా
చైనా మరోసారి సరిహద్దు ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడింది. భారత రక్షణ మంత్రి చైనాలో పర్యటించి పదిరోజులు కూడా గడవక ముందే మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. చైనా సేనలు మరోసారి లడఖ్ సెక్టార్ లోని చుమార్ సెక్టార్ లో భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి. కొన్ని బంకర్లను ధ్వసం చేయడమే కాకుండా సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన కెమేరా వైర్లను కత్తిరించేశాయి. జూన్ 17 న ఈ సంఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. లడఖ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉన్న మారుమూల గ్రామం చుమార్ ని చైనా తమ ప్రాంతంగా పేర్కొంటోంది. కానీ చైనా నుంచి ఇక్కడికి రావడానికి దారిలేదు.
భారత్ నుంచి రోడ్డు మార్గం ఉంది. గత ఏడాది హెలీకాప్టర్ ద్వారా చైనా కొందరు సైనికుల్ని ఇక్కడ దించింది. చుమార్ ప్రాంతంలో వాస్తవాధీన రేఖకు ప్రత్యక్షంగా దారి లేకపోవడంతో ఇబ్బంది పడుతోందని, అందుకే భారత్ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కెమేరాలను ధ్వంసం చేసిందని అధికార వర్గాలంటున్నాయి. కానీ నిపుణులు మాత్రం భారత్ ను అన్నివేపుల నుంచి దిగ్భంధనం చేసిన చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతోందంటున్నారు.
ఆసియాలో ఏకైక బలమైన శక్తిగా నిరూపించుకునేందుకు చైనా అన్ని భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్ వంటి దేశాలను పెట్టుబడులు, సైనిక సహాయంతో ఆకట్టుకుంటోంది. నలువైపుల నుంచి భారత్ పై దాడి చేసేందుకు 24 గంటల పహారాతో సిద్దంగా ఉంది. మూడో ప్రత్యామ్నాయ అంతర్జాతీయ శక్తులుగా ఎదుగుతోన్న చైనా, భారత్ లకు సరిహద్దు వివాదం ఏళ్ల తరబడి కొనసాగుతోంది.