: తక్కువ ధరకే బిడ్డ!
మీరు సంతాన లేమితో చాలా కాలంగా బాధపడుతున్నారా...? అయితే ఐవీఎఫ్ సాంకేతిక పరిజ్ఞానంతో మీరు సంతానవంతులు కావచ్చు... అంటూ మనకు చక్కగా ప్రకటనలు కనిపిస్తుంటాయి. అయితే ఈ ఐవీఎఫ్ సాంకేతిక పరిజ్ఞానం చాలా ఖరీదైంది. దీంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాల వారికి ఇది దూరంగా ఉంటూ వస్తోంది. ఇందుకోసం తక్కువ ధరకే ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వినియోగానికి వీలుగా, అక్కడి ప్రజలకు అందుబాటు ధరలో టెస్ట్‌ట్యూబ్ బేబీ సాంకేతిక పరిజ్ఞానాన్ని బెల్జియంకు చెందిన వైద్యులు తయారు చేశారు.
పాశ్చాత్య దేశాల్లో ప్రస్తుతం వాడకంలో ఉన్న ఐవీఎఫ్ పరిజ్ఞానంకంటే చాలా తక్కువ ఖర్చుతోనే తాము రూపొందించిన నూతన సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుందని బెల్జియం వైద్యులు చెబుతున్నారు. వాటితో పోలిస్తే వీటి ధర కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే ఉంటుందని, ఈ పరిజ్ఞానం త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిజ్ఞానంతో పిండ దశలోనే అన్ని రకాల వైద్య పరీక్షలు (ఎంబ్రియో స్క్రీనింగ్) పూర్తి చేసుకుని చక్కటి ఆరోగ్యంతో జన్మించిన తొలి ఐవీఎఫ్ మగబిడ్డగా అమెరికాకు చెందిన బాబు ప్రపంచ రికార్డు సృష్టించాడు. తక్కువ ధరకే అందుబాటులో ఉన్న 'నెక్ట్స్ జనరేషన్ సీక్వెన్సింగ్' ఐవీఎఫ్ విధానం ద్వారా పిండ దశలోనే ఈ బాబుపై వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ బాబులో జన్యుపరమైన లోపాలేమైనా ఉన్నాయా అనే విషయాన్ని పూర్తిగా పరీక్షించారు. ఇలాంటి పరీక్షల వల్ల సంతానం కోసం తపిస్తున్న దంపతులకు సంపూర్ణ ఆరోగ్యవంతులైన పిల్లల్ని పొందే అవకాశం ఉంటుంది. పిండ దశలోనే అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల పిండ ఎదుగుదలలో లోపాల కారణంగా గర్భస్రావాలు కావడం వంటి ఇబ్బందులేవీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.