: నిజాలే రాస్తానంటున్న క్రికెట్ 'దాదా'
భారత క్రికెట్ లో దూకుడైన సారథిగా పేరుగాంచిన సౌరవ్ గంగూలీ త్వరలోనే జీవిత చరిత్ర రాయాలని నిర్ణయించుకున్నాడు. ఆ పుస్తకంలో అన్ని విషయాలు ఉంటాయని చెప్పబోనని, కానీ, నిజాలే రాస్తానని స్పష్టం చేశాడీ ప్రిన్స్ ఆఫ్ కోల్ కతా. నేటితో 41వ పడిలో పడిన ఈ క్రికెట్ దాదా కోల్ కతాలో మీడియాతో ముచ్చటించాడు. కచ్చితంగా ఆటోబయాగ్రఫీ రాస్తానని చెబుతూ, అయితే, అది ఐపీఎల్ ముగిసిన తర్వాతే కార్యరూపం దాల్చుతుందని తెలిపాడు. ఐపీఎల్ ఒప్పందాలు పూర్తయిన పిమ్మట కలం పడతానని చెప్పాడు.
కెరీర్ ఆసాంతం దూకుడు మంత్రం పఠించిన గంగూలీ.. స్టీవ్ వాను టాస్ కోసం వేచి చూసేట్టు చేయడం, లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గాల్లో తిప్పడం, గ్రెగ్ చాపెల్ తో వివాదాలు వంటి విషయాలను, తన జీవితచరిత్రలో పొందుపరిస్తే అభిమానులకు మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని క్రికెట్ వర్గాలంటున్నాయి.