: ఉత్తరాఖండ్ ను ముంచెత్తుతున్న వర్షాలు
ఉత్తరాఖండ్ ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో మొన్నటి వరదలకు నష్టపోయిన గ్రామాలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. డెహ్రాడూన్ ను కూడా వర్షాలు వదలడం లేదు. ఎడతెరిపి లేని వర్షాలతో భగీరధి నది పొంగి పొర్లుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ప్రభుత్వం ప్రజలకు సూచించింది. డెహ్రాడూన్ లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
మరో వైపు రాష్ట్రవ్యాప్తంగా వరద నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలకు నిత్యావసర సరకులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ట్రక్కులను ఉపయోగిస్తోంది. భారీ వర్షాల కారణంగా అవి హైవేల్లో ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో హెలీకాప్టర్ల సేవలను ఉపయోగించుకుంటోంది. అయినప్పటికీ సహాయక చర్యలు సజావుగా సాగడం లేదు. భారీగా కురుస్తున్న వర్షాలు, గాలులు హెలీకాప్టర్లను కూడా కదలనీయడం లేదు.