: భారీగా తగ్గిన బంగారం దిగుమతులు
బంగారం దిగుమతులు పెరిగాయ్ బాబోయ్... అంటూ తలలు పట్టుకున్న కేంద్ర ప్రభుత్వం 'హమ్మయ్య' అని గట్టిగా ఊపిరి పీల్చుకుంది. జూన్ నెలలో బంగారం దిగుమతులు ఏకంగా 80.56 శాతం తగ్గిపోయాయి. జూన్ లో 31.5 టన్నుల బంగారమే దేశంలోకి దిగుమతి అయింది. ఈ వివరాలను ప్రభుత్వంలోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్, మే నెలల్లో 300 టన్నుల బంగారం దిగుమతి కావడంతో కేంద్ర ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది. దిగుమతులు పెరిగితే ప్రభుత్వ కరెంటు ఖాతా లోటు కూడా పెరుగుతూ పోతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణంతోపాటు అన్నింటి మీదా ప్రభావం పడుతుంది.
దీంతో దిగుమతులపై కస్టమ్స్ సుంకం పెంచడం, బ్యాంకులు బంగారం విక్రయించకుండా నిషేధించడం, బంగారు రుణాల జారీని పరిమితం చేయడం లాంటి ఎన్నో చర్యలను ప్రభుత్వం తీసుకుంది. ఫలితంగా బంగారం దిగుమతులు గతనెలలో గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, బంగారం ధరలు పడిపోయినందున కొనుగోళ్లు పెరుగుతాయని, ఫలితంగా రానున్న నెలల్లో దిగుమతులు పెరుగుతాయని వర్తకులు భావిస్తున్నారు.