: మనకు ఇద్దరు చందమామలు వుండేవారట!


భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. అయితే ఇది ఇప్పటి మాట... ఒకప్పుడు భూమి చుట్టూ ఇద్దరు చందమామలు తిరుగుతుండేవారట... ఇదేదో చందమామ కథ అనుకుంటున్నారా... కాదు, ఈ కొత్త సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తీసుకువచ్చారు. ఒకప్పుడు భూమికి ఇద్దరు చంద్రులు ఉండేవారని, చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారనేది ఈ సిద్ధాంతం.

శాంతాక్రజ్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఎరిక్‌ అస్ఫాగ్‌ ఈ ఇద్దరు చంద్రుల సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం భూమి చుట్టూ ఇద్దరు చంద్రులు ప్రదక్షిణ చేసేవారని, ఆ ఇద్దరూ ఒకేసారి పుట్టారని, ఇలా తిరిగి, తిరిగి చివరికి రెండు చంద్రులు ఒక్క చందమామగా అయిపోయారని ఆయన చెబుతున్నారు. భూమి పుట్టుకతోనే రెండు చంద్రులతో పుట్టిందని ఎరిక్‌ చెబుతున్నారు. ఇందులో ఒక చందమామ పెద్దదిగా ఉంటే రెండో చందమామ మొదటిదానిలో మూడో వంతు మాత్రమే ఉండేదట. ఇద్దరు చందమామలు భూమినుండి ఒకే దూరంలో ఒకే వేగంతో తిరుగుతుండేవారట. ఇలా తిరుగుతూ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఇద్దరిలో చిన్న చందమామ పెద్దవాణ్ని ఢీకొట్టి పెద్దవాడిలో కలిసిపోయాడట. దీంతో ఇప్పటి పెద్ద చందమామగా తయారయ్యాడని ఎరిక్‌ చెబుతున్నారు. అయితే దీనికి ఆధారమేంటని అడుగుతున్నారా... చంద్రుడి వెనుకభాగం (ఇది భూమికి కనిపించదు)లో ఉన్న పెద్ద పెద్ద కొండలు దీనికి ఆధారమంటున్నారు ఎరిక్‌. వచ్చే సెప్టెంబరులో లండన్‌లో జరిగే రాయల్‌ సొసైటీలో జరిగే 'చందమామ సదస్సు'లో ఎరిక్‌ అస్ఫాగ్‌ తన రెండు చంద్రుల సిద్ధాంత ప్రతిపాదన గురించి వినిపిస్తారట.

  • Loading...

More Telugu News