: చిన్న పులి పెద్ద పగ
ఒక చిన్న పులి పిల్ల... పాపం అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూవుంటే... దొంగలు వేసిన ఉచ్చులో చిక్కుకుని చనిపోయింది. అయితే ఇది తెలిసిన పులులు ఆ దొంగలను ఊరికే వదలలేదు. ఏకంగా వారిపై దాడిచేసి ఒకరిని చంపేశాయి. అంతేకాదు... మూడురోజులుగా మిగిలిన ఆ దొంగలను చంపేందుకు మాటువేసి ఉన్నాయి.
అడవుల్లో కలపను దొంగిలించేందుకు అడవిలోకి వెళ్లిన దొంగలకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లోని మౌంట్ లూసర్ జాతీయ పార్కులోని అత్యంత విలువైన కలపను దొంగిలించేందుకు వెళ్లిన కొందరు దొంగలు అక్కడ జింకలు వంటివి దొరుకుతాయేమోనని వేసిన ఉచ్చులో ఒక పులిపిల్ల చిక్కుకుని మరణించింది. దీంతో ఆగ్రహించిన పులులు వారిపై దాడిచేసి ఒక వ్యక్తిని చంపేశాయి. మిగిలిన ఐదుగురు దొంగలపైకి దాడిచేశాయి. దీంతో ప్రాణభయంతో ఆ దొంగలు చెట్లెక్కి కూర్చున్నారు. ఎప్పటికైనా మీరు కిందికి దిగకపోతారా... అన్న ఉద్దేశ్యంతో పులుల మంద ఆ చెట్టుకింద పహరా కాస్తున్నాయి. పాపం రెండు రోజులైనా పులులు కదల్లేదు. ఈ విషయం తెలిసిన సమీప గ్రామస్తులు దొంగలను కాపాడేందుకు వెళ్లినా అక్కడున్న పులుల మందను చూసి భయపడి వెనక్కి వచ్చేశారు.
విషయం తెలిసిన పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. మౌంట్ లూసర్ జాతీయ పార్కులో పులులు, ఏనుగులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అయినా కూడా కలపకోసం వెళ్లిన దొంగలు పాపం పులుల చేత చిక్కారు. దొంగలను రక్షించేందుకు 30 మంది పోలీసులను, సైనికులను సహాయంగా పంపామని, వారు ఆ ప్రాంతానికి చేరుకోవాలంటే మరో రెండుమూడు రోజులు పడుతుందని, అప్పటి వరకూ పులులు చెట్టుకిందే ఉంటే వారిని కాపాడేందుకు వాటిని చంపటమో, లేదా మత్తుమందు ప్రయోగించడమో చేయాల్సి ఉంటుందని ఆ జిల్లా పోలీస్ ఛీఫ్ డిక్కీ సోందాని చెబుతున్నారు.
ప్రపంచంలోనే అత్యంత చిన్న పులి సుమత్రా దీవుల్లోని పులి. ఈ పులులు ఇక్కడి అడవుల్లో సుమారు 400 నుండి 500 దాకా ఉన్నాయి. పులి చిన్నదైనా పగ మాత్రం పెద్దదిగానే ఉంది. మొత్తానికి కలప దొంగలకు భలే అనుభవమే ఎదురైంది.