: జింబాబ్వే టూర్ కు జట్టు ప్రకటన.. గంభీర్ కు మొండిచేయి


గౌతమ్ గంభీర్ కథ ఇక ముగిసినట్టే! ఏడాదిక్రితం ఫామ్ లేమితో టీమిండియాలో చోటు కోల్పోయిన ఈ లెఫ్ట్ హ్యాండర్ ఇటీవలే తాను జట్టులో కొస్తానంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా జింబాబ్వే టూర్ కు తన ఎంపిక ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఆలోచనలు మరోలా ఉన్నాయి. చాంపియన్స్ ట్రోఫీ వంటి భారీ టోర్నీలో విజయం యువకుల ప్రతిభ వల్లే సాకారమైందన్న వాస్తవం వారిని మరోసారి యువత వైపే మొగ్గేట్టు చేసింది. ఈ క్రమంలో నేడు జింబాబ్వే పర్యటనకు టీమిండియాను ప్రకటించగా.. గంభీర్ కు చోటు దక్కలేదు.

గంభీర్ తో పాటు సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ లకు సైతం సెలక్టర్లు మొండిచేయి చూపారు. రెగ్యులర్ కెప్టెన్ ధోనీకి గాయం కావడంతో అతని స్థానంలో యువ కెరటం విరాట్ కోహ్లీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు. కాగా, ఆఫ్ స్పిన్నర్ అశ్విన్, పేసర్లు ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతినిచ్చారు. ఇక జట్టులో ఇద్దరు కొత్త ముఖాలకు చోటు కల్పించారు.

కాశ్మీర్ కు చెందిన ఆఫ్ స్పిన్నర్ పర్వేజ్ రసూల్, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మోహిత్ శర్మలను జింబాబ్వే టూర్ కు ఎంపిక చేశారు. తెలుగుతేజం రాయుడు మరో అవకాశం అందిపుచ్చుకున్నాడు. ఈ వికెట్ కీపింగ్ బ్యాట్స్ మన్ పై సెలెక్టర్లు నమ్మకముంచారు. కాగా, రసూల్ జమ్మూకాశ్మీర్ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి క్రికెటర్ గా చరిత్ర పుటల్లోకెక్కాడు.

జట్టు వివరాలు..

కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, సురేశ్ రైనా, దినేశ్ కార్తీక్, అంబటి రాయుడు, అజింక్య రహానే, రవీంద్ర జడేజా,అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్, మహ్మద్ షమి, వినయ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, మోహిత్ శర్మ.

  • Loading...

More Telugu News