: కేన్సర్‌కు చికిత్స చేస్తే ఎయిడ్స్‌కూడా నయమయింది!


ఒక వ్యాధికి చికిత్స చేస్తే దానితోబాటు మరో వ్యాధి కూడా నయమయింది. ఇద్దరు వ్యక్తులు ఎయిడ్స్‌ బారిన పడ్డారు. ఈ వ్యాధికి వారు చాలాకాలంగా చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారిలో లింఫోమా అనే రకమైన క్యాన్సర్‌ వ్యాధి కూడా ఉన్నట్టు పరీక్షల్లో బయటపడింది. దీంతో వైద్యులు మూలకణాల మార్పిడి చికిత్సను జరిపారు. తర్వాత కొద్దిరోజులకు వారిని పరీక్షిస్తే వారిలో కేన్సర్‌ వ్యాధి నయం కావడంతోబాటు అంతవరకు ఉన్న ఎయిడ్స్‌ వ్యాధి కూడా నయమయినట్టు తేలింది.

బోస్టన్‌లో జరిగిన ఈ సంఘటనలో ఇద్దరి రక్తాన్ని పరీక్షించిన వైద్యులకు వారి రక్తంలో హెచ్‌ఐవీ వైరస్‌ కనిపించలేదని తేలింది. వీరిలో ఒక వ్యాధిగ్రస్తుడికి 15 వారాల నుండి ఎయిడ్స్‌ కి ఇస్తున్న మందులను ఇవ్వడం మానేయగా, మరో రోగికి ఏడు వారాల నుండి ఎయిడ్స్‌కు సంబంధించిన మందులను ఇవ్వడం నిలిపివేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను కౌలాలంపూర్‌లో ఏర్పాటైన అంతర్జాతీయ ఎయిడ్స్‌ సొసైటీ సమావేశంలో బోస్టన్‌లోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌, బ్రిగమ్‌ అండ్‌ విమెన్స్‌ హాస్పిటల్‌కు చెందిన తిమోతి హెన్రిచ్‌ తెలిపారు. అయితే ఈ ఇద్దరు రోగుల శరీరం నుండి ఎయిడ్స్‌ పూర్తిగా తొలగిపోయిందా? అనే విషయాన్ని ఇప్పుడే పూర్తిగా చెప్పలేమంటున్నారు.

  • Loading...

More Telugu News